లింగాష్టకం యొక్క అర్థం మీకు తెలుసా?: Lingashtakam in Telugu With Meaning:
లింగాష్టకం – తెలుగు అర్ధాలతో
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
అర్థం :
ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
అర్థం :
ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
అర్థం :
ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
అర్థం :
ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
అర్థం :
ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అర్థం :
ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
అర్థం :
ఏ లింగము ఎనిమిది రెక్కల పువ్వులను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
అర్థం :
ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
అర్థం :
లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని (లింగం) దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.