భక్తి & ఆధ్యాత్మికం

అయ్యప్ప దీక్ష ప్రాధాన్యత.. పాటించాల్సిన నియమాలు..

అయ్యప్ప దీక్ష ప్రాధాన్యత

ధనుర్మాసం అనగానే సూర్యోదయంలోగా స్నానాలు.. పూజలు.. ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఈ మాసంలోనే వేలాది మంది భక్తులు జ్యోతిస్వరూపుడు.. హరిహరసుతుడు.. శబరిమల మీద కొలువై ఉన్న దేవదేవుడు, ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేబట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళతారు. శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు.

శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష.. మరోసారి అల్పాహారం.. రెండుసార్లు చన్నీటి సాన్నం.. నేలపై నిద్రించాలనే కఠిన నియమాలతోరణమే ఈ దీక్ష. ప్రాధాన్యత.. పాటించాల్సిన నియమాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. దీక్ష చేపట్టే విధానం అయ్యప్పస్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు, గోళ్లు, ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగీ, కండువా, చొక్కా, తులసిమాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్లాలి.

దీక్ష చేపట్టే విధానం

ఆరుసార్లు శబరి యాత్రకు బయలుదేరి మకరజ్యోతిని దర్శించుకున్న గురుస్వామితో మాల స్వీకరించాలి. స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుడిని విభూదిగా, విష్ణువును కుంకుమ రూపంగా భావించి నుదిటిపై దిద్దుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాదిపాటు మాల ధరించకూడదు. భార్య మరణిస్తే ఆరునెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి.
దీక్ష స్వీకరించాక.. మాలధారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలుకాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ఎత్తయిన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి.
మండల దీక్ష కోసం సంకల్పం తీసుకొని కలశస్థాపన చేయాలి. ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసేవరకు కదిలించకూడదు. దేవతామూర్తుల చిత్రపటాలకు శిరుస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి. దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతి స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామిని పూజించిన పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి. మొదటిసారి మాలధరించిన స్వామిని కన్నెస్వామి అని, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగో సారి గదస్వామి, ఐదోసారి పెరుస్వామి, ఆరు నుంచి 18వ సారి వరకు వివిధ పేర్లతో పిలుస్తారు.

అయప్ప మాల ధరించే వారు పాటించాల్సిన నియమాలు:

1. మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి.
2. భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో 41 రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు.
3. సూర్యుడు నెత్తిమీదికి వచ్చాక మధ్యాహ్నం మూడు గంటలలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి.
4. కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి.
5. మలవిసర్జనకు వెళ్తే తిరిగి స్నానమాచరించి స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి.
6. మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి.
7. అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య, అనబడే పదునెట్టాంబడికి దూరంగా ఉండాలి.
8. తన శక్తికొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి.
9. శరణుఘోష ప్రియుడైన అయ్యప్ప పూజల్లో తరుచూ పాల్గొనాలి.
10. హింసాత్మక చర్యలు,దుర్భాషలాడడం,అబద్ధాలాడడం చేయరాదు. దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి.
11. తల్లిదండ్రులు మినహా దీక్షలోలేనివారికి పాదాభివందనం చేయకూడదు.
12. బ్రహ్మచర్యం పాటిస్తూ నుదిటిపై విభూది, కుంకుమ, చందనం విధిగా ఉండాలి.
13. నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ ఎదుటి అయ్యప్పలను గౌరవించాలి.

పదునెట్టాంబడి:

పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, దర్పం, అహంకారం, వీక్షణాశక్తి, వినికిడి శక్తి, అగ్రాణశక్తి, రుచి చూసే శక్తి, స్పర్శశక్తి, సత్వగుణాలు, తమోగుణం, రజోగుణం, విద్య, అవిద్య. ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథాల్లో పొందుపరిచారు. ఆ మెట్లలో 18 రకాల శక్తులుండటం వల్ల 18 సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మాల విరమణ: శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటివద్ద మాతృమూర్తితో మాల తీయిం చాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపర్చాలి. కొందరు తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాలతీస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button