ఆహారం

Lemon Benefits: రక్తవృద్ధికి, రక్తశుద్ధికి, శరీరశక్తికి అద్భుత ఔషధి – నిమ్మ…

Lemon : Nutrients, Benefits & Uses

జంబీర అనే గంభీరమైన పేరుతో వంటగదిలో ప్రత్యక్షమయ్యే నిమ్మకాయలు, నిజానికి మన ఆరోగ్యఛాయలు!!
ఆయుర్వేద ఔషధాలు తయారుచేసేప్పుడు విషపాషాణాలను శుద్ధిచేసి, చక్కని ఔషధాలుగా రూపొందింప చేసేందుకు తోడ్పడే, నిమ్మరసానికి మానవ శరీరాన్ని దోషరహితంచేసి, శుద్ధి చేయగల శక్తి వుందనటం అతిశయోక్తి కాదు. మన శరీరానికి రోగాలు రాకుండా వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించగల సత్తావున్న మన వంటింటి నేస్తం ‘నిమ్మ’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. . నిమ్మ ప్రస్తావన తీసుకురాగానే మీకు నోట్లో నీళ్ళూరుతున్నాయి కదూ. మరి నిమ్మ మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది, ఏ ఏ సమస్యలకు ఎలా వాడాలి.. అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..

కడుపులో దోషాలకు :
నిమ్మరసానికి ఆకలినీ, జీర్ణశక్తినీ పెంపొందింపచేసే శక్తి వుంది. అన్నం సహించక పోవటం అనే లక్షణాన్ని పోగొట్టి ఆకలిని కల్గిస్తుంది. దప్పిక ఎక్కువగా అయ్యే లక్షణాన్ని పోగొడుతుంది. నాలిక పైన జిగురుగా వుండటం వలన నోటికి రుచి తెలియకుండా పోతుంది. నిమ్మరసం తీసుకుంటూ వుంటే జిగురు పోయి రుచి కలుగుతుంది. నిమ్మరసం, తినే షోడాఉప్పు కలిపి తాగితే కడుపులో మంట, నొప్పి, పైత్యం, తలతిరుగుడు తగ్గుతాయి, వాంతి, వికారం కూడా తగ్గుతాయి. నిమ్మరసానికి ఎనిమిదిరెట్లు నీరు కలిపి పడుకోబోయే ముందు తాగితే మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఈ మలబద్ధకం ఒక్కదాన్ని సరిచేస్తే సమస్త వ్యాధుల్నీ అరికట్టినట్టే…

ఎక్కిళ్ళు అదే పనిగా వస్తున్నప్పుడు నిమ్మరసంలో తినే షోడాఉప్పు కలుపుకుని తాగితే నెమ్మదిస్తాయి. పంచదార కూడా కలుపుకోవచ్చు. అలసటను పోగొట్టి, శ్రమను, నీరసాన్ని, నిస్సత్తువను తగ్గించి, చురుకు, ఉత్సాహాన్ని కల్గించడానికి నిమ్మరసం అప్పటికప్పుడు దొరికే చక్కటి ఔషధం.. నిమ్మరసంలో పంచదార, ఉప్పు కలుపుకొని తాగితే నిస్సత్తువ లక్షణాలన్నీ తగ్గుతాయి. వేడి చేయడం కూడా తగ్గుతుంది. చలవను కల్గిస్తుంది. దప్పికను తగ్గిస్తుంది. విషలక్షణాలను ఎదుర్కోవటంలోనూ, ఎలర్జీని ఎదుర్కోవటంలోనూ మంచి సహాయకారి నిమ్మ!!..
తేలు, కందిరీగలు, తేనెటీగలు ఇలాంటివి కుట్టినప్పుడు వీటి విషాలకు విరుగుడుగానూ, ఆ విషం వలన కలిగే ఎలర్జీకి విరుగుడుగా కూడా నిమ్మరసం పనిచేస్తుంది. మత్తు పదార్ధాలు, ఆల్కహాల్, నాటు సారాయి వంటివి అధికంగా తీసుకున్నప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి తగినంత ఉప్పు, తినే షోడా కలిపి తాగిస్తే మత్తు వదులుతుంది.

రక్తవృద్ధి కోసం నిమ్మరసం:
రక్తక్షీణతలో నిమ్మరసం అతి ముఖ్యమైన ఔషధం. రక్తక్షీణత తగ్గి రక్తం బాగా పుష్టిగా పట్టేందుకోసం ఐరన్ కు సంబంధించిన ఔషధాలనిస్తారు. ఈ ఐరన్ శరీరానికి బాగా వంటపట్టడానికి నిమ్మరసాన్ని తీసుకొంటే ఆ ఔషధం బాగా పనిచేస్తుంది. మీ వైద్యులు వ్రాసిన మందులు వేసుకొని నిమ్మరసం తాగండి అంతే!

నిమ్మరసంతో ఎలర్జీని ఎదుర్కొండి
నిమ్మ రసం తాగితే జలుబు చేస్తుంది అని చాలా మంది నమ్మకం. కొందరి విషయంలో ఆది నిజం కూడా! కానీ, నిమ్మరసం తాగితే ఎలర్జీ తగ్గి జలబు తగ్గే అవకాశాలు కూడా వున్నాయి, కాబట్టి, ఎలర్జీ వ్యాధులతో బాధపడేవారు, తమకు నిమ్మరసం సరిపడుతోందో లేదో పరీక్షించి చూసుకొని , అది తాగితే జలుబు చేయటం అనే లక్షణం లేకపోతే .. తప్పనిసరిగా నిమ్మరసాన్ని రోజూ తాగితే మంచిది. ఎలర్జీ తగ్గుతుంది. చెవి, ముక్కు, గొంతు వ్యాధులన్నింటిలోనూ నిమ్మరసం మంచిది !!!

చర్మసౌందర్య రహస్యం నిమ్మరసమే!..
చర్మ సౌందర్యాన్ని పెంపొందింపచేసే ఔషధాలలో నిమ్మరసం కూడా ఒకటి. నిమ్మరసంలోని సి-విటమిన్ సూర్యరశ్మికి చర్మం వడిలిపోకుండా SUN SCREENING AGENT లా పనిచేసి చర్మానికి మంచిరంగు వచ్చేలా సాయపడ్తుంది.. శరీరంలోని దుష్టపదార్ధాలను వెళ్ళగొట్టి చర్మానికి మంచికాంతిని కల్గించడంలో నిమ్మ మంచి సహాయకారి. నల్లని చర్మాన్ని ఎర్రగా చేయడానికి నిమ్మరసం ఉపయోగపడ్తుంది.. కాని, బొల్లి వ్యాధిలో మాత్రం నిమ్మరసం గానీ, సి-విటమిన్ కల్గిన ఇతర పదార్థాలు గానీ తీసుకోకూడదు.
జుట్టును పట్టుకుచ్చులా మెత్తబరిచే శక్తి నిమ్మరసానికి, నిమ్మకాయలకూ వుంది. నిమ్మరసాన్ని తలకు బాగా పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయండి. జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా ఉంటుంది. చర్మానికి రాసుకొంటే చర్మం కాంతివంతంగా వుంటుంది. మృదువుగా తయారౌతుంది. ముఖానికి రాసుకొంటే జిడ్డు పోతుంది. గడ్డం గీసుకునేప్పుడు తెగిన చోటో, మొటిమలున్నప్పుడు పుండుపడినచోటో నిమ్మరసం తగలనీకండి. మంటెత్తిపోతుంది.
సున్నిపిండి తయారుచేసుకొనేటప్పుడు కొన్ని ఎండించిన నిమ్మకాయ డిప్పల్ని కూడా అందులో కలిపి మరాడిస్తే ఆ సున్నిపిండి చర్మానికి మంచి రంగునిస్తుంది… శీతాకాలం పగుళ్ళు బారి, చర్మం ఎండినట్లుండే వారికి, దద్దుర్లు, దురద వచ్చే వారికి ఈ సున్నిపిండి అద్భుతంగా పనిచేస్తుంది…

కామెర్లకు నిమ్మరసం మంచిది
లివర్ వ్యాధులు, ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో నిమ్మరసాన్ని చక్కగా తీసుకోవచ్చు. నిమ్మ, బత్తాయి, కమలా ఫలాలను ఎంత ఎక్కువగా తీసుకొంటే ఈ వ్యాధిలో అంతమంచిది. షుగర్ వ్యాధి వున్న వారికి కామెర్లు వస్తే వారు నిమ్మరసాన్ని తీసుకుంటే మంచిది ! మూత్రంలో వేడి, మంట, పచ్చదనం కూడా తగ్గుతాయి…

జ్వరాలలో నిమ్మరసం తీసుకోండి
టైఫాయిడ్, మలేరియా, వైరస్ వలన కలిగే జ్వరాలు,అమ్మవారు, పొంగు, గవదబిళ్ళలు.. మొదలైన వ్యాధుల్లో నిమ్మరసాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. గవదబిళ్ళల వ్యాధిలో లాలాజలం ఆగిపోయి నాలిక ఎండిపోయినట్లవుతుంది. అలాంటి పరిస్థితిలో నిమ్మరసం తీసుకుంటే, త్వరగా లాలాజలం ఊరి రుచి తెలియటం ప్రారంభిస్తుంది. నిమ్మఉప్పుకు అద్ది, నాలిక పైన రాసుకుంటే నోటి జిగురు, నోరు అసహ్యంగా వుండటం, తడి ఆరిపోవటం, దప్పిక తగ్గుతాయి.

తలలో వేడి తగ్గేందుకు నిమ్మరసం
ఆముదంలో కొద్దికొద్దిగా నిమ్మరసం కలుపుతూ నూరి, పూర్తిగా కలిసి పోయాక, ఆ ఆముదాన్ని తలకు మర్దన చేస్తే తలలో వేడి తగ్గి, చలవని కల్గిస్తుంది. కళ్ళు మంటలు, తలనొప్పి, మూర్ఛలు, అపస్మారం, ఫిట్స్, తలతిరుగుడు వంటి వ్యాధులు తగ్గుతాయి.. పళ్ళలోంచి నెత్తురు కార్తుంటే నిమ్మరసం తాగండి. పళ్ళలోంచి నెత్తురు కారడానికి అనేక కారణాలు వున్నాయి. సి-విటమిన్ తగ్గటం ఒక కారణం అయితే, ఇప్పుడు మార్కెట్లో దొరికే కొన్ని టూత్ పేస్ట్లు సరిపడక పోవటం ఇంకొక కారణం. పేస్ట్ పడకపోయినా చిగుళ్ళలోంచి నెత్తురు కారడం జరగవచ్చు. నిమ్మరసాన్ని తాగితే పళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుళ్ళు మెత్తపడటం, వాయటం తగ్గుతాయి.

వడదెబ్బ తగలకుండా నిమ్మరసంతో పానీయం
ఎండాకాలం వచ్చిందంటే నీరసం వచ్చి పడిపోయే పరిస్థితులు చాలా మందికి వస్తుంటాయి. ఇంట్లోంచి బైటకు వెళ్ళేప్పుడు, బైట నుంచి ఇంట్లోకి వచ్చాక ఒక గ్లాసు మజ్జిగలో ఒక నిమ్మకాయరసం తగినంత ఉప్పు, తినే షోడా ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే వడదెబ్బ కొట్టకుండా వుంటుంది. వడదెబ్బ తగిలినా ఈ పానీయాన్ని తాగితే త్వరగా కోలుకుంటారు…

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button