God Puja: దేవుడి పూజలో ఈ తప్పులు దొర్లకూడదు..!
ప్రతీ హిందువు దైవం కోసం కొంత ప్రదేశాన్ని తమ ఇంట్లో కేటాయిస్తారు. వారి వారి స్థోమతను బట్టి కొందరు తక్కువ ప్రదేశంలో దేవుడి విగ్రహాలను ఉంచితే, కొందరు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించి అందులో దేవుడి విగ్రహాలనుంచి పూజిస్తారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం పూజ చేసిన తర్వాతనే మన రోజువారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
చాలా మంది ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకునే పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా పూజ చేసే సమయంలో పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఏవి ఉండకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రంలో తెలియజేయబడింది. సాధారణంగా పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు అన్నీ లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పకుండా అవసరమవుతాయి. అలాంటి వస్తువులు పూజగదిలో ఉండటంవల్ల ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ విధంగా పూజకు కావలసిన సామాగ్రి సమర్పించుకుని పూజ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అయితే పూజ చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం.
మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక చేతితో దేవుడిని నమస్కరించకూడదు. మొదటగా భగవంతుని నమస్కారం ఆ తర్వాత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు భగవంతుడుతో సమానం కాబట్టి వారి పాదాలకు నమస్కరించాలి. అయితే ఏ సమయంలో కూడా పడుకొని ఉన్న వారి పాదాలకు నమస్కారం చేయకూడదు. చాలామంది పూజ చేసే సమయంలో మంత్రాలను పఠిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మంత్రాలను చదివేటప్పుడు తప్పులు చదవకూడదు. అలాగే దేవుని గదిలో మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కుడిచేతిని వస్త్రంతో కప్పుకొని ఉండాలి.
ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటి రోజులలో మగవారు క్షవరం, గడ్డం తీసుకోకూడదు. అదేవిధంగా పూజ చేసే సమయంలో ఒంటిపై చొక్కా లేకుండా శాలువా కప్పుకొని పూజ చేయాలి. పూజ చేసే సమయంలో ఎప్పుడూ కూడా మన ఎడమ చేతి వైపు నెయ్యి దీపాన్ని వెలిగించి, కుడివైపు దేవతా విగ్రహాలను పెట్టుకోవాలి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీపాన్ని ఎల్లప్పుడు నేలపై ఉంచకూడదు. ప్రమిద కింద ఏవైనా ధాన్యాలను వేసి దీపాన్ని వెలిగించాలి. పూజ చేసే సమయంలో మనం ఎల్లప్పుడూ తూర్పువైపున కూర్చుని పూజ చేయాలి.
అదే విధంగా పూజ గదిలో ఎల్లప్పుడు మన చేతి కుడి వైపు శంఖం, నీరు తప్పకుండా ఉంచుకోవాలి. అదే విధంగా ఎడమ వైపు గంట, సూర్యభగవానుడి ఫోటో ఎడమ వైపు ఉంచాలి. ఈ విధంగా పూజ చేసే సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా ఆ దేవతల కృపకు పాత్రులు కాగలమని పండితులు చెబుతున్నారు.