Friendship Day 2023 । ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి.. మరి మీరు ఉంటారా?!
Happy Friendship Day 2023: ప్రపంచంలోని అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి. ఒక స్నేహితుడు మనల్ని అర్థం చేసుకోనేంత బాగా మనకు మనం గానీ, మన తల్లిదండ్రులు గానీ అర్థం చేసుకోలేరు. మనం చడ్డీలు వేసుకునే వయసు నాటి నుంచి పాఠశాలలో మన క్లాస్ మేట్ గా, మన హృదయం ముక్కలైనపుడు మన గ్లాస్ మేట్ గా మనకు తోడుగా ఉండేవాడు ఎవరైనా ఉంటారా అంటే అది మన స్నేహితులే అయి ఉండాలి. మనం చేసే మంచిచెడులలో పాలుపంచుకునే వారు, మన జీవితంలో ఎదురయ్యే మంచిచెడులలో మన పక్కన నిలబడేవారు, మనకు మంచిచెడులను చెప్పేవారు మన స్నేహితులు కాక ఇంకెవ్వరు. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్నేహితులదే ప్రత్యేకమైన బంధం. అంతటి గొప్ప బంధాన్ని వేడుక చేసుకోవడానికి ప్రతీ ఏడాది ఆగష్టు మొదటి ఆదివారంను స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
ఈ ఏడాది స్నేహితుల దినోత్సవం ఆగష్టు 6న వస్తుంది. మరి మీరు కూడా ఈ ఆదివారం మీ స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోడానికి సిద్ధమేనా? మీరు మంచి ఫ్రెండ్ అయితే మీరు మీ స్నేహితులతో కలిసి ఎందుకు వేడుక చేసుకోకూడదు?
మంచి స్నేహితులు ఉన్నవారు నిజంగా చాలా అదృష్టవంతులు, అయితే మనమందరం మంచి స్నేహాలను కోరుకుంటున్నప్పుడు, మన స్నేహితులకు కూడా మనం ఒక మంచి స్నేహితుడిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. మంచి స్నేహితుడు అనిపించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. మరి మీలో మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి.
పలకరిస్తూ ఉండాలి
ఈ బిజీ ప్రపంచంలో, రోజూ మీ స్నేహితులతో కనెక్ట్ అవ్వడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అయినప్పటికీ సమయం తీసుకొని వారితో కనెక్ట్ అవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు దూరంగా ఉంటే వారితో ఫోన్లోనైనా సంభాషించడం, సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం, అప్పుడప్పుడు ఏదో రకంగా పలకరించడం చేయాలి. ఇది వారిని మీరు మరచిపోలేరని సూచిస్తుంది.
కమ్యూనికేట్ చేయండి
కమ్యూనికేషన్ ప్రతి సంబంధానికి పునాదిని ఏర్పరుస్తుంది. స్నేహంలో కూడా ఏదైనా అపార్థాలు చోటు చేసుకున్నప్పుడు వారికి విషయం ఏంటనేది కమ్యూనికేట్ చేయాలి, వారికి స్పష్టత ఇవ్వగలగాలి.
ఎంజాయ్ చేయండి
మంచి స్నేహితులు అంటే సరదాగా ఉండాలి. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయలేని వాడు ఇంకెవరితోనూ చేయలేడు. మంచి స్నేహితుడు అంటే తన స్నేహితులకు ఆనందం, వినోదం, నవ్వును తీసుకురాగలగాలి. ఈ సంతోషకరమైన జ్ఞాపకాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, సంవత్సరాల తరబడి మీతో ఈ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి.
మంచి శ్రోతగా ఉండాలి
మనం చెప్పేది ఎవరూ విననపుడు, కనీసం మన స్నేహితుడైనా వినాలని కోరుకుంటాం. మన బాధలు వినేందుకు ఒకరు ఉండాలి అని కోరుకుంటాం. కాబట్టి మంచి స్నేహితుడు అంటే మంచి శ్రోతగా ఉండాలి. వారు చెప్పే మంచిచెడులకు బుద్ధిపూర్వకంగా స్పందించాలి, వారికి ఆరోగ్యకరమైన మంచి సలహాలు ఇవ్వాలి.
ప్రశంసించాలి
ఒక చిన్న ప్రశంస చాలా దూరం వెళుతుంది. మీ స్నేహితుడు ఏదైనా విజయం సాధిస్తే, మంచి స్నేహితుడు అనేవారు తన స్నేహితుడి విజయానికి అతిపెద్ద ఛీర్‌లీడర్‌గా ఉండాలి, వారు సాధించిన విజయానికి ప్రశంసలు తెలియజేయాలి. అలాగే వారి వైఫల్యాలలోనూ మనం ఎప్పుడూ అండగా ఉండాలి.
కాబట్టి ఫ్రెండ్స్.. అదీ సంగతీ, హ్యాప్పీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవంకు ముందస్తు శుభాకాంక్షలు.