ఆహారం

Ashwagandha Benefits: అశ్వగంధ – ఏ ఏ వ్యాధులలో ఎలా వాడాలి…

Ashwagandha : Nutrients, Benefits & Uses

ఈనేలపైన సృష్టించిన అనంతశక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధ నిధి అశ్వగంధ. దీన్ని తెలుగులో పెన్నేరు చెట్టు అని పిలుస్తారు. “పేరు లేని రోగానికి పెన్నేరుచెట్టు ” అనే సామెత విన్నారా?.. అంటే ఏ రోగమో గుర్తించలేనిస్థితిలో, ఈ పెన్నేరుగడ్డను ఇవ్వడంద్వారా ఆవ్యాధిని నిర్మూలించవచ్చని, ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు. ఇంత మహత్తరమైన అశ్వగంధను పూర్వకాలంలో, ప్రతిగ్రామంలో చెరువుగట్లపైన, పంట పొలాలలోను, పెంచుకొని ఆ ఊరి ప్రజలంతా వాడుకునే గొప్ప సంప్రదాయం వుండేది… ఆధునిక విషనాగరికత విజృంభించిన తరువాత, ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయిన మనం, ఈమొక్కలకు దూరమయ్యాం… ఈ వీడియోలో అశ్వగంధ ప్రాముఖ్యత గురించి, ఏ ఏ వ్యాధులలో ఎలా వాడాలి.. ఎప్పుడు వాడాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..

అశ్వగంధను సంస్కృతంలో అశ్వగంధ, వాణీకరి అని, హిందీలో అంగంధ్ అని, తెలుగులో పెన్నేరు అని అంటారు.

అశ్వగంధచెట్టు చూడటానికి వంకాయచెట్టులా వుంటుంది. కాయలు బఠాణి గింజలంత సైజులో ఎర్రగా కాస్తాయి. ఈ చెట్టులో, ప్రధానంగా దీని దుంపలకు ఎక్కువ ప్రాధాన్యం వుంది. ఈదుంపలు కొంచెం చేదురుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి .

అశ్వగంధ దుంపలు – ఆవుపాలశుద్ధి
ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్ లో ఈ దుంపలనుతెచ్చి, శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగేవరకు, ఆవుపాలుపోసి చిన్నమంటపైన పాలన్నీ ఇగిరిపోయేవరకు, మరిగించి దించి ఆ ముక్కలను ఎండబెట్టాలి. ఇలా చేసిన తరువాతే ఈదుంపలను ఉపయోగించుకుంటే అనేక రెట్లు అధికమైన లాభం చేకూరుతుంది…

బలహీనమైన పిల్లలకు – అశ్వగంధ శుద్ధిచేసిన దుంపలను ఎండించి దంచి, పొడిచేసి వాటితో సమంగా పటికబెల్లంపొడి కలిపి నిలువ వుంచుకోవాలి. బలహీనంగా వుండే పిల్లలకు, బుద్ధిబలం లోపించిన పిల్లలకు, ఒక చెంచా పొడి ఒకకప్పు వేడిపాలతో కలిపి సేవింపచేస్తుంటే శారీరక బలం, బుద్ధిబలం పెరుగుతాయి.

ఉత్తమ సంతానానికి అశ్వగంధ: స్త్రీలు బహిష్టుస్నానం చేసిన నాలుగవ రోజునుండి పరగడుపున, శుద్ధఅశ్వగంధ చూర్ణాన్ని 10గ్రాముల మోతాదుగా, అరగ్లాసు వేడి ఆవుపాలతో తాగుతూ, భర్తతో సంసారం చేస్తుంటే సంతానప్రాప్తి కలుగుతుంది.

వళ్ళంతా మంటలు, పోట్లు, తాపం ఉంటే:
అశ్వగంధ, త్రిఫలచూర్ణం, అతిమధురం, పల్లేరు పొడి, శతావరిపొడి, పసుపు, మానిపసుపు, వీటిని సమంగా తీసుకొని ఈ మొత్తం ఎంతతూకముంటే అంత కొండపిండి వేర్ల పొడి కలిపి ఆమొత్తం ఎంత వుంటే అంత పటికబెల్లంపొడి కలిపి నిలువ వుంచు కోవాలి. పూటకు 5గ్రాముల మోతాదుగా రెండుపూటలా మంచినీటితో సేవిస్తుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి.

బిగించిన మూత్రం – వెంటనే వచ్చుటకు
అశ్వగంధ, తిప్పతీగ, శొంఠి, ఉసిరికాయల బెరడు, ఏనుగుపల్లేరుకాయలు వీటిని సమానంగా పొడులుచేసి కలిపి నిలువవుంచుకోవాలి. రెండు గ్లాసుల మంచినీటిలో 20గ్రాముల పొడివేసి అరగ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి, ఒకచెంచా తేనెకలిపి తాగితే వెంటనే మూత్రబంధం, మూత్రంలో మంట తగ్గిపోయి, సాఫీగా మూత్రం బయటికి వస్తుంది.

ఉబ్బసం, మూర్ఛవంటి – అసాధ్య రోగాలకు అశ్వగంధాదిచూర్ణం: అశ్వగంధపొడి 640గ్రాములు, దోరగావేయించిన శొంఠి పొడి 320 గ్రాములు, దోరగా వేయించిన పిప్పలికట్టె పొడి 160గ్రాములు, దోరగా వేయించిన మిరియాలపొడి 80 గ్రాములు, ఎలక్కాయల పొడి 40గ్రాములు, నాగకేసరాల పొడి 20గ్రాములు, లవంగాల పొడి 10గ్రాములు, కలిపి అందులో 1270గ్రాముల, పటిక బెల్లంపొడి కలిపి గాజుపాత్రలో నిలువవుంచుకోవాలి. ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు 5గ్రా మోతాదుగా, ఒకచెంచా తేనె కలిపి రెండుపూటలా ఆహారానికి, గంట ముందు తింటూవుంటే ఉబ్బసం, ఆయాసం, ఆకలి లేకపోవడం, అతిపైత్యం, మూర్ఛ, అపస్మారం హరించిపోయి మనసుకు శాంతి, దేహానికి కాంతి, వీర్యానికి బలంకలుగుతాయి.

యోనిబిగువుకు పెన్నేరుదుంప:
అశ్వగంధగడ్డను మంచినీటితో సానరాయిపైన అరగదీసి, ఆ గంధాన్ని స్త్రీలు యోనికి లేపనం చేసుకొంటూవుంటే, యోని బిగువుగా మారుతుంది.

బహిష్టును క్రమపరిచే – అశ్వగంధ:
అశ్వగంధపొడి 5గ్రాములు, పటికబెల్లంపొడి 5 గ్రాములు, కలిపి రోజూ ఉదయం మంచినీటితో సేవిస్తుంటే, అతిగా స్రవించే ఋతురక్తం ఆగిపోయి, తగిన ప్రమాణంలోనే విడుదలౌతుంది.

లింగబలానికి అశ్వగంధ:
అశ్వగంధ దుంపలపొడి, నీటిలో పెరిగే నాచును ఎండించి చేసినపొడి, నల్లఉమ్మెత్త గింజలపొడి. సమంగా కలిపి నిలువచేసుకోవాలి. రోజూరాత్రి తగినంత పొడిని నిమ్మరసంతోనూరి, లింగంపైన ముందు బాగం విడచి, వెనుకభాగానికి లేపనంచేసి, ఉదయం కడుగుతూవుంటే అంగం దృఢంగా మారుతుంది.

వాతరోగాలకు – పెన్నేరు చూర్ణం:
పెన్నేరు దుంపలపొడి, దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి, దోరగా వేయించిన చవ్యంపాడి, చిత్రమూలం వేర్లపొడి, సమంగా కలిపి దీనికి రెండు రెట్లు పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి. దీన్ని ప్రతిరోజూ 10గ్రాముల మోతాదుగా రెండుపూటలా, ఆహారానికి గంట ముందు తింటుంటే సమస్త వాతవ్యాధులు సమూలంగా హరించిపోతాయి….

అతిరతికి – అశ్వగంధ:
అశ్వగంధ దుంపలను ఏడుసార్లు అవుపాలలో వేసి పాలు ఇగిరేవరకు మరిగించి ఎండించి దంచినపొడి, అలాగే చేసిన అతిమధురంపొడి, అలాగే శుద్ధిచేసిన నేలగుమ్మడిపొడి, అలాగే శుద్ధిచేసిన నేలతాడి దుంపల పొడి, ఏనుగుపల్లేరుకాయల పొడి, మినుములపొడి, శతావరిపొడి, దూలగొండి గింజలపొడి, ఉసిరికాయల పొడి, బూరుగు జిగురుపొడి సమంగా కలపాలి. ఈ మొత్తానికి సమానంగా పటికబెల్లంపొడి కలిపి ఆ మొత్తం చూర్ణంలో తగినంత మంచితేనె చేర్చి బాగా పిసికి లేహ్యంలాగాచేసి నిలువవుంచుకోవాలి.
రోజూ రెండుపూటలా ఆహారానికి రెండుగంటల ముందు, 20గ్రాముల ముద్దను తిని ఒకగ్లాసు ఆవుపాలు తాగుతూవుంటే, 40రోజులలో అంతులేనంత శరీర బలం, వీర్యవృద్ధి కలుగుతాయి.

తుంటినొప్పికి – అశ్వగంధపొడి:
అశ్వగంధపొడి పావుచెంచా మోతాదుగా రోజూ రెండు లేక మూడుపూటలా మంచినీటితో సేవిస్తూ వుంటే తుంటినొప్పి తగ్గిపోతుంది.

ఉబ్బసానికి :
అశ్వగంధపొడి 50గ్రాములు, దోరగా వేయించిన కురసాని ఓమపొడి 20గ్రాములు, దోరగా వేయించిన జిలకర పొడి 50గ్రాములు, దోరగావేయించిన వాముపొడి 50గ్రాములు, కరక్కాటకశృంగి పొడి 50గ్రాములు, సమంగా కలిపి నిలువ వుంచుకోవాలి. దీనిని రెండుపూటలా ఆహారానికి ముందు 3 గ్రాములు, మోతాదుగా వేడినీటితో సేవిస్తుంటే దగ్గు, ఉబ్బసరోగం హరించిపోతాయి..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button