ఆహారం

Asoka Tree Benefits – స్త్రీల సమస్త రోగాల నుండి ఈ చెట్టు కన్నతల్లిలా కాపాడుతుంది

Asoka Tree : Nutrients, Benefits & Uses

అశోక చెట్లు మనలో చాలామందికి తెలుసు. ఇందులో సన్నగా పొడవుగా పెరిగే చెట్లను అశోకచెట్లు అని చాలామంది భ్రమచెందుతారు. కానీ, అవి ఔషధాలకు ఉపయోగపడే అసలైన అశోకచెట్లు కావు. అశోక చెట్లు అచ్చం మామిడిచెట్టులాగా పెరుగుతుంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అనాదిగా మనదేశంలో అశోకచెట్టు భారతీయుల శోకాలను అనగా అనేక రకాల రోగాలను పోగొడుతూ, మనల్ని కన్నతల్లిలాగా కాపాడుతూ వుంది. రామాయణంలో కూడా సీతమ్మతల్లిని రావణుడు అశోకవనంలోనే ఉంచినట్లుగా వ్రాయబడింది. ఈ చెట్టు ఏవిధంగా అనేక రకాల రోగాలను పోగొడుతుందో వివరంగా తెలుసుకుందాం.

అశోక చెట్టుని సంస్కృతంలో అశోక, శోకనాశ, హేమపుష్ప అని, హిందీలో అశోక్ అని, తెలుగులో అశోకవృక్షం అని, ఆంగ్లంలో Asoka Tree అని అంటారు.

అశోక చెట్టు గుణదోషాలు- ప్రభావాలు: అశోక చెట్టు విస్తారంగా సుగంధపరిమళాలతో కూడిన పువ్వులను పూస్తుంది. దీని చెక్క కషాయం లేక చూర్ణం వగరు చేదు రుచులతో అన్ని వ్రణాలను, క్రిమిరోగాలను, కఫరోగాలను, జంతువిషాలను, స్త్రీల బట్టంటు రోగాలను హరించివేస్తుంది.

అశోకమాను బెరడును తెచ్చి కడిగి నానబెట్టి మెత్తగా దంచి ముద్దచేసి దాన్ని కొంచెం వెచ్చ చేసి, పైన వేసి కట్టుకడుతూవుంటే మేహవాత నొప్పులు ఖచ్చి తంగా తగ్గిపోతాయి.

స్త్రీల బట్టంటు రోగాలకు – అశోక:
ఒకలీటరు మంచినీటిలో అశోకమాను బెరడు 100 గ్రాములు నలగ్గొట్టివేసి, పావులీటరు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి దించి, దాన్ని రెండు భాగాలుగా చేసి ఉదయం సగం, సాయంత్రం సగం మోతాదుగా తగినంత కండచక్కెర కలిపి తాగుతుంటే స్త్రీల తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులతో స్రవించే బట్టంటు రోగాలు తగ్గిపోతాయి. ఇదే కషాయాన్ని ఉపయోగిస్తుంటే యోని శూల, యోనిమంట మొదలైన యోని సమస్యలు కూడా తగ్గిపోతాయి.

అధిక ఋతురక్తానికి – అశోక:
అశోక మానుబెరడు 80 గ్రాములు, నాటు ఆవుపాలు 80 గ్రాములు, మంచినీరు 320 గ్రాములు తీసుకోవాలి. చెక్కను కడిగి నలగ్గొట్టి రసంతీయాలి. ఆ రసం,ఆవు పాలు, నీరు అన్నికలిపి పొయ్యిమీద పెట్టి నీరు ఇగిరి పోయేవరకు మరిగించి మిగిలిన కషాయాన్ని వడ పోసుకొని మూడు మోతాదులుగా, మూడుపూటలా కొద్దిగా పటికబెల్లం కలిపి సేవించాలి. ఇది సేవించేటప్పుడు కారం, ఉప్పు, పులుపు, మాంసం, గుడ్లు, చేపలువంటి పదార్థాలు సేవించ కూడదు. చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తుంటే అధికఋతురక్తం ఆగిపోతుంది. అంతేగాక, గర్భాశయంలోని ఇతర సమస్యలన్నీ కూడా నయం అవుతాయి. గర్భంరాని స్త్రీలకు ఈ కషాయం తాగడం వలన గర్భాశయ శుద్ధి జరిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

రక్తప్రదరానికి – మరోమంచిమార్గం:
అశోకచెట్టు పూలరసం అరచెంచా, నాగకేసరాల పొడి అరచెంచా కలిపి ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో మెత్తగానూరి వడపోసి, అందులో ఒకచెంచా కండచక్కెరపొడి కలిపి మూడుపూటలా తాగుతుంటే స్త్రీలకు ధారాపాతంగా రక్తంపోవడం ఆగిపోతుంది. తెల్లబట్టరోగానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది..

అశోకపూలు నీడలో ఎండించి దంచిన పొడి 100గ్రాములు, శంకుజీరాపొడి 20గ్రాములు, ఎర్రజేగురు మట్టి 20గ్రాములు, వీటిని పలుచని నూలుబట్టలో జల్లెడ పట్టి, ఆ మెత్తటి పొడిలో కండచక్కెరపొడి 200గ్రాములు రోజూ రెండు పూటలా పావుచెంచాపొడి చల్లటినీటిలో తాగుతుంటే తెల్లబట్ట తగ్గిపోతుంది.

స్త్రీలకు – స్వప్నదోషనివారణకు:
బహిష్టుస్నానం తరువాత పురుషుడితో సంభో గం జరిపినట్లుగా కల వస్తే, ఆ స్త్రీలకు మర్మాయవాలు బలహీనపడి జీర్ణశక్తి క్రమంగా తగ్గిపోతుంది. నడుము పట్టుతప్పిపోతుంది, మలబద్దకం కలుగుతుంది. వాయువు ఉదరంలో ప్రవేశించి మిధ్యాగర్భం వచ్చే టట్లు చేస్తుంది. అలాంటివారు అశోకచెట్టుపూలు, గులాబిరెక్కలు, నాగ కేసరాలు, ఆరెపువ్వు, పొంగించిన పటికపొడి, శతావరి చూర్ణం, దోరగా వేయించిన సోంపు గింజలపొడి, సమాన భాగాలుగా కలిపి పలుచని నూలుబట్టలో జల్లెడ పట్టి, ఆమొత్తం చూర్ణానికి సమానంగా పటిక బెల్లంపొడి కలిపి నిలువ చేసు కోవాలి. పూటకు అరచెంచా పొడి మోతాదుగా రెండు పూటలా చల్లని నీటితో తాగుతుంటే,స్వప్న దోషం వల్ల స్త్రీలకు కలిగిన సకల అనారోగ్యాలు తగ్గిపోతాయి…

క్షయదగ్గుకు – అశోక:
అశోకచెట్టు వేరు పై బెరడును దంచి పొడిచేసి జల్లించి నిలువచేసుకోవాలి. పూటకు 2 గ్రాములు మోతాదుగా ఒకకప్పు మేకపాలతో కలిపి సేవిస్తుంటే క్షయ దగ్గు తగ్గిపోతుంది.

గర్భస్రావం కాకుండా: అశోకపూలచూర్ణం 10గ్రాములు, అశోకమాను బెరడు చూర్ణం 10గ్రాములు, లొద్దుగపట్టచూర్ణం 10గ్రాములు, గులాబిపూల చూర్ణం 10గ్రా॥ కలిపి నిలువ వుంచు కోవాలి. ప్రతి మూడుగంటలకు ఒకసారి 3గ్రాములు చూర్ణం, చల్లనినీటితో మూడు నాలుగుసార్లు తాగిస్తే గర్భస్రావం ఆగిపోతుంది.

సంతానప్రాప్తికి – అశోక రసాయనం:
అశోకచెట్టు పైబెరడు అయిదుకేజీల మోతాదుగా తెచ్చి కడిగి నలగ్గొట్టి దానికి పన్నెండు రెట్లు నీటిలోవేసి ఒకరోజు నానబెట్టి తరువాత నాలుగవ వంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి. తరువాత వడపోసి అందులో పాతబెల్లం పది కేజీలు, కరక్కాయబెరడు పొడి, తానికాయ బెరడు పొడి, ఉసిరిక బెరడు పొడి, మానిపసుపు, నల్లజీల కర్రపొడి, తుంగగడ్డలపొడి, సొంటి పొడి, ఎర్ర చందనంపొడి, తెల్లజీలకర్రపొడి, అడ్డసరపు ఆకుల పొడి, మామిడిజీడి పొడి, కలువరేకుల పొడి, ఒక్కొక్కటి 50గ్రాముల చొప్పున కలిపి ఆరెపువ్వులపొడి ముప్పావుకేజీ అందులోవేసి కుండపైన మూకుడు పెట్టి, గాలి పోకుండా మట్టిబట్టతో గాలిపోకుండా కట్టి చేసి నెల రోజులు నిలువవుంచాలి. తరువాత తీసి పైతేటనీరు వడపోసుకోవాలి. ఇదే ఆశోక రసాయనం. పూటకు 20 గ్రాములు మోతాదుగా ఈరసాయనాన్ని రెండుపూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్త యోనిరోగాలు, గర్భరోగాలు, బహిష్టు వ్యాధులు మాయమైపోయి, సంతానప్రాప్తి కలుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button