Castor Oil Plant Benefits – సమస్త రోగాల నుండి ఈ చెట్టు కన్నతల్లిలా కాపాడుతుంది
Castor Oil Plant : Nutrients, Benefits & Uses
మనల్ని అమ్మలాగా అనుక్షణము కాపాడే అత్యంత విలువైన చెట్లలో ఈ ఆముదం చెట్టు సుప్రసిద్ధమైనది. ఆ చెట్టుగింజలనుండి తీసిన ఆముదంనూనెతో మన ప్రాచీనతరాలు సంపూర్ణ ఆరోగ్యంతో గడిపారని మనం గుర్తుచేసుకోవాలి . దీని సర్వాంగాలు వందలాది వ్యాధులను పోగొట్టడానికి ఉపయోగపడతాయి.
ఆముదం చెట్టుని సంస్కృతంలో ఏరండ, పంచాంగుళ, వర్ధమాన అని, హిందీలో ఆర్ఖండ్, రేండీ అని, తెలుగులో ఆముదం చెట్టుఅని, ఇంగ్లీషులో Castor oil plant అంటారు.
ఆముదంచెట్లలో ఎర్రాముదాలచెట్టు, తెల్లాముదాలచెట్టు అని రెండురకాలుంటాయి. తెల్లాముదం చెట్లలో పెద్దగింజలు కాచేది ఒకటి. చిన్నగింజలు కాచే చిట్టాముదంచెట్టు ఒకటి వుంటాయి. తెల్ల ఆముదాలచెట్టు కన్నా ఎర్రాముదాలచెట్టుకు అధికగుణములు కలవని అనుభవజ్ఞుల అభిప్రాయం. ఇది పక్షవాతము మొదలైన సమస్తవాతములను, అజీర్ణరోగములను, ఇంకా శరీరంలోని సమస్త అవయవాలలో వచ్చే అనేక వ్యాధులను కూడా పోగొడుతుంది.
పక్షవాతమునకు, మలబద్దకమునకు:
అముదం గింజలు 100గ్రాముల తీసుకొని పగులకొట్టి పైబెరడు తీసివేయాలి. లోపల తెల్లగావుండే పప్పును మెత్తగా నూరి గిన్నెలో వేసి నాలుగురెట్లు ఆవుపాలుపోసి, కోవాలాగా మారేవరకు ఉడికించాలి. తరువాత అందులో 100గ్రాముల చక్కెర వేసి, చిన్న మంటపైన మరిగిస్తూ పదార్థమంతా లేహ్యం అయిన తరువాత దించి నిలువవుంచుకోవాలి. రోజూ రెండుపూటలా ఆహారానికి గంట ముందు 5గ్రాముల నుండి 10గ్రాముల మోతాదుగా ఈహల్వాను తింటూవుంటే అన్నిరకాల వాతరోగాలు మలబద్దకం, పక్షవాతం హరించిపోతాయి.
పిల్లల కడుపులో పురుగులుంటే– ఆముదపు ఆకును ముక్కలుగా చేసి బిడ్డల గుద స్థానములో రెండుమూడుసార్లు ఆకులతోరుద్దితే కడుపులోని పురుగులన్నీ మలంద్వారాబయటికి వస్తాయి.
మూలవ్యాధి నిర్మూలించుటకు-లేత ఆముదపు ఆకులను, ఒక కర్పూరం బిళ్ళకలిపి మెత్తగానూరి ఆసనానికి కట్టుకడుతూ వుంటే మూల వ్యాధి తొలగిపోతుంది.
బహిష్టు ఆగిన స్త్రీలకు: ఆముదపు ఆకును కొంచెం నలగ్గొట్టి వేడిచేసి గోరువెచ్చగా పొత్తికడుపు పైన పరిచి గుడ్డతోకట్టుకట్టి రాత్రినుండి ఉదయందాకా వుంచుతూవుంటే ఋతుబద్దం హరించిపోయి బహిస్తువస్తుంది.
పురుషాంగ – బలహీనతకు: 100గ్రాముల పైబెరడు తీసిన ఆముదపుపప్పు, 100 గ్రాముల మంచి నువ్వులనూనె, ఈ రెండింటిని కలిపి చిన్నమంటపైన పప్పుమాడిపోయేవరకు మరిగించి దించి వడపోసి నిలువచేసుకోవాలి. రోజూ నిద్రించే ముందు 5 నుండి 10 చుక్కలనూనెను పురుషాంగం పైన మృదువుగా ఇంకిపోయేవరకు రుద్ది ఉదయం స్నానం చేస్తూవుంటే క్రమంగా అంగబలహీనత తగ్గిపోయి పురుషాంగానికి పూర్తిబలంచేకూరుతుంది.
కీళ్ళనొప్పులకు, మంటలకు, ఆముదపు ఆకులకు నువ్వులనూనెపూసి, ఆకులను వెచ్చచేసి వేడివేడిగా కీళ్ళపైన వేసి కట్టుకడుతూవుంటే కీళ్ళవాపులు, నొప్పులు తగ్గుతాయి. అలాగే ఆముదపు పప్పును మెత్తగానూరి వేడిచేసి గోరువెచ్చగా ఆముద్దను కీళ్ళపైన వేసి కట్టుకడుతూ వుంటే కీళ్ళమంటలు తగ్గిపోతాయి.
దురదలు త్వరగా తగ్గుటకు ఆముదపు గింజలను పగులగొట్టి పైబెరడును తీసివేసి లోపలి పప్పును పెరుగులో వేసి ఒకరోజు నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని దురదలపైన లేపనం చేస్తూవుంటే వారంరోజుల్లో కఠినమైన దురదలు కనిపించకుండాపోతాయి.
చర్మంపై కురుపులు, వ్రణాలు వస్తే ఆముదపుచెట్టు వేరును మంచినీటితో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని కురుపులపైన లేపనం చేస్తూవుంటే అతిత్వరగా కురుపులు, పుండ్లు తగ్గిపోతాయి. ఆముదము ఆకును మెత్తగా దంచి వ్రణాల పైన వేసి కట్టుకడుతూవుంటే వ్రణాలు మాడిపోతాయి.
గర్భాశయ వాపు హరించుటకు ఆముదపు ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పరిశుభ్రమైన బెత్తెడు వెడల్పు పొడవుగల నూలుబట్టకు పట్టించి ఆబట్టను వత్తిలాగా చుట్టి దానిని యోనిలోపల వుంచాలి. ఒక గంటతరువాత తీసివేయాలి. ఇలా ఉదయం ఒక వత్తి, సాయంత్రం ఒక వత్తి మార్చి పెడుతూవుంటే అయిదారు రోజుల్లో స్త్రీల గర్భాశయపు వాపు తగ్గిపోతుంది.
అనవసర రోమములకు, పైబెరడు తీసివేసిన ఆముదపు పప్పును మెత్తగా నూరి వెంట్రుకలను తీసివేసినచోట రుద్దుతూవుంటే వెంట్రుకలు త్వరగా మొలవవు.
సమస్త వాతవ్యాధులకు – ఆముదపు చెట్టువేర్లు, శొంఠి, దేవదారు చెక్క, సన్నరాష్ట్రం, తిప్పతీగ సమభాగాలుగా తీసుకొని విడివిడిగా ఆరబెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమచూర్ణం 20 గ్రాముల మోతాదుగా అరలీటరు మంచినీటిలో వేసి అరపావులీటరు కషాయం మిగిలే వరకు చిన్నమంటపైన మరిగించి వడపోసి గోరు వెచ్చగా రోజూ ఉదయం పరగడుపున సేవిస్తూవుంటే క్రమంగా అన్నిరకాల వాతరోగాలు అణగారిపోతాయి.
కాలిన పుండ్లకు కమ్మనిమార్గం – సున్నపుట పైనీరు, ఆముదం ఈరెండు సమంగా ఒకపాత్రలో పోసి గిలగొట్టి అది వెన్నలాగా మారిన తరువాత దాన్ని కాలినపుండ్లపైన, బొబ్బలపైన లేపనం చేస్తూవుంటే అవిత్వరగా మాడిపోతాయి.
సర్వవిషాల సంహారం – బాగా ముదిరిన ఆముదపు చెట్టునుండి విధిపూర్వకంగా పూజచేసిన తరువాత దానివేర్లు తెచ్చి శుభ్రంగా కడిగి చిటికెనవేలంత ముక్కలు చేసి నీడలో గాలి తగిలేచోట ఆరబెట్టి నిలువవుంచుకోవాలి. మానవులు విషప్రభావానికి గురైనప్పుడు వెంటనే ఒక ముక్కను బుగ్గన పెట్టుకొని నములుతూ ఆరసాన్ని మింగుతూవుంటే విషప్రభావం హరించిపోతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.