ఆహారం

Coconut Benefits: కొబ్బరిచెట్టు అద్భుత ఔషధగుణాల గురించి….

Coconut : Nutrients, Benefits & Uses

దేవుడికి నైవేద్యం పెట్టినా, దయ్యానికి దిష్టి తీసినా కొబ్బరికాయ ప్రాముఖ్యత కొబ్బరికాయదే… చలవచేయటం, తక్షణ శక్తి నివ్వటం, శ్రమనూ, అలసటనూ పోగొట్టటం, గుండెకూ, మూత్రపిండాలకు, నరాలకు, పేగులకూ, శక్తిని కల్గించటం, గర్భాశయ దోషాలను పోగొట్టటం, లివర్ జబ్బుల్ని, ముఖ్యంగా కామెర్లవ్యాధిని పోగొట్టటం… ఇలా అనేకానేక వ్యాధులకు అద్భుత ఔషధాలుగా ఉపయోగపడుతుంది “కొబ్బరి”. దీనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..

కొబ్బరిచెట్టులో పనికిరాని భాగం అంటూ ఏదీలేదు. కాబట్టి నిస్సందేహంగా ఇది కల్పవృక్షమే…

అమృతంలా ప్రాణం పోసే కొబ్బరినీళ్ళు:
అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయంగా వున్నప్పుడు ప్రకృతిసిద్ధంగా దొరికే అమృతజలం కొబ్బరినీళ్ళు, వాంతులు, విరేచనాలు, వడదెబ్బ, ఉపవాసాలు, జాగరణలు, అతిగా ప్రయాణాలు, అమితంగా ఉపన్యాసాలు చెప్పి అలిసిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ‘శోష’ వచ్చి మనిషి కుప్పకూలిపోతాడు. తక్షణం శక్తి కలగడానికి కొబ్బరినీళ్ళలో, గ్లూకోజ్ గానీ , పంచదారగానీ కలిపి త్రాగిస్తే, ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడతారు.. లేత కొబ్బరి నీళ్ళు వాంతుల్ని తగ్గిస్తాయి. పైత్యాన్ని పోగొడతాయి. ముదిరిన కొబ్బరి నీళ్ళు పడనివారికి జలుబు చేస్తాయి. దగ్గువస్తుంది. కానీ, మంచి శక్తినిస్తాయి.

రక్తపోటు వ్యాధికి కొబ్బరి పువ్వు వైద్యం:
మీ ఇంట్లో కొబ్బరి చెట్టుంటే, మీకు బీపీ వ్యాధి లేనట్టే లెక్క. నేలమీద రాలిపడే కొబ్బరి పువ్వుల్ని సేకరించుకొని, నేతిలో వేయించి, మెత్తగా దంచి అరచెంచాపాడి చొప్పున మూడు పూటలా తీసుకోండి. వీలైతే తేనెతో గానీ, పంచదారతోగానీ, లేకపోతే నేరుగానే ఈ పొడిని తీసుకోవచ్చు. బీపి తీవ్రత తగ్గుతుంది. రక్తస్రావం ఆగుతుంది. రక్తంతో కూడిన వాంతి తగ్గుతుంది. విరేచనాల వ్యాధిలో రక్తం పడటం తగ్గుతుంది. గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ ఇది చక్కగా పని చేస్తుంది.

నెలసరి సరిగా రానివారికి కొబ్బరినీళ్ళు:
నెలసరి సరిగా రానివారికి, గర్భాశయంలో ఇతర దోషాలున్నవారికి, మైల అసలు కాకపోవటంగానీ, అధికంగా అవటంగానీ జరుగుతున్నవారికి కొబ్బరినీళ్ళను 25 రోజులపాటు, క్రమపద్ధతిలో రోజు ఇస్తే ఆయా దోషాలు నెమ్మదిస్తాయి.

కామెర్ల వ్యాధిలో కొబ్బరిపాలు:
లేత కొబ్బరిచిప్పని తురిమి మెత్తగా రుబ్బి రసం తీయండి. కొబ్బరిపాలు అంటే ఇవే.. ఈ కొబ్బరిపాలలో మంచిగంధం చెక్కని అరగదీసి ఒక గ్లాసు పాలకు ఒక చెంచా మంచి గంధం మోతాదులో కలిపి త్రాగించండి. కామెర్లు తగ్గుతాయి. మంచి గంధం కలపకపోతే కొబ్బరిపాలు పైత్యం చేస్తాయి. మంచిగంధం కలిపిన లేత కొబ్బరి పాలను త్రాగిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కడుపులో మంట, నొప్పి తగ్గుతుంది. మంచి వీర్యపుష్టినిస్తుంది. తక్షణం శక్తినిస్తుంది. అలసట తగ్గుతుంది.. వృద్ధులకు దీన్ని వాడితే, మూత్రపు బాధలు తగ్గి, మూత్రం పల్చగా జారీ అవుతుంది.

గజ్జి, తామర, దురదలకు కొబ్బరి చిప్పలతో చిట్కా:
బాగా ఎండిన కొబ్బరిచిప్పల్ని కుంపట్లో వేసి బాగా కాల్చి నూనె తీస్తారు. ఈ నూనెని గజ్జి, తామరవంటి అంటువ్యాధులు వచ్చినచోట చర్మంపైన రాస్తే ఆయా వ్యాధులు నెమ్మదిస్తాయి. తలకు రాస్తే పేలుచచ్చి పడిపోతాయి. నేరుగా కొబ్బరినుంచి తీసిన నూనెని రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది.

కొన్ని కొబ్బరి నూనెలు రాస్తే వెంట్రుకలు రాలిపోతాయి – ఎందుకని ?..
చాలామంది తలవెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడ్తుంటారు. వీరు తలకు ఏం రాస్తున్నారని అడిగితే రకరకాల బ్రాండ్ల కొబ్బరినూనెల్నిగానీ, గానుగల్లో కొన్న కొబ్బరినూనెని గానీ రాస్తున్నట్లు చెప్తారు. కల్తీమయంగా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మనం దేన్నీ నమ్మడానికి వీల్లేదు. తలవెంట్రుకలు రాలడానికి కారణాలు అనేకం వున్నాయి. వాటిలో మీరువాడ్తున్న బ్రాండ్ కొబ్బరినూనె, మీకు పడకపోవడం కూడా ఒకటి.. చాలామంది విషయంలో ఇదే ముఖ్యకారణంగా వుంటుంది. ఇలాంటి వారు బ్రాండ్ ని మార్చి వాడటం మంచిది. లేదా ఆయుర్వేదీయ పద్ధతిలో తయారైన భృంగామలక తైలంగానీ, బ్రాహ్మీతైలంగానీ, మందార తైలంగానీ, చందనాది తైలంగానీ వాడటం మంచిది. శాస్త్రీయ పద్ధతిలో తయారైన ఈ తైలాలు కొబ్బరినూనెతో గాక నువ్వులనూనెతో తయారైనవి ఎంచుకోవడం మంచిది…

కొబ్బరి పీచుతో కడుపులో పాములకు మందు:
కొబ్బరికాయ పీచుతీసేప్పుడు సన్నని పొట్టు రాలుతుంది. దీన్ని జాగ్రత్తగా తీసుకుని, నేతిలో వేయించి, బెల్లం లేతపాకంపట్టి కుంకుడు గింజలంత మాత్రలు చేసి పూటకు రెండుమూడు మాత్రలు తీసుకోవాలి. ఇలా కొన్నాళ్ళపాటు తినిపిస్తే కడుపులో పెరిగే బద్దె పురుగు (Tape Worm) తదితర పాములు నశిస్తాయి.

కడుపులో మంటకు లేత కొబ్బరిపీచురసం:
లేతకొబ్బరి బోండాం కొట్టించుకుని నీళ్ళు తాగేశాక, అందులో లేతకొబ్బరి తీసుకుని, కొబ్బరిడిప్పల్ని అవతల పారేస్తారుకదా… ఈసారి అలా పారేయకుండా, దాని లేత పీచుని దంచి రసంతీసి, తీపి కలిపి తాగించండి. కడుపులో మంట తగ్గుతుంది…

కొబ్బరి దూదితో రక్తస్రావం తగ్గుతుంది:
లేతకొబ్బరి ఆకుల పువ్వులో, ఆకుని అంటుకొని దూదిలాంటి మెత్తని పదార్ధం వుంటుంది. దీన్ని గాయాల మీద అంటిస్తే వెంటనే రక్తస్రావం ఆగడమే కాకుండా గాయం త్వరగా మానుతుంది. కొబ్బరినూనెలో సున్నం కలిపి కాలిన గాయాలపైన పల్చగా పట్టువేసి, ఒక గంట తర్వాత కడిగేస్తే నొప్పి తగ్గుతుంది.

కొబ్బరి ఆకులతో గడ్డలు కరిగించవచ్చు:
లేత కొబ్బరి ఆకుని కాటుకలా మెత్తగా నూరి దాంట్లో సైంధవ లవణాన్ని కూడా మెత్తగా నూరి కలిపి చీముగడ్డలు, గోరుచుట్టు, గవదబిళ్ళలు, వృషణాలలో వాపు వంటి చోట కడితే వాపు కరుగుతుంది. గడ్డలు త్వరగా పక్వానికి వస్తాయి. నొప్పి తగ్గుతుంది. కొబ్బరి కోరుని వేడిచేసి కడితే చీము గడ్డల్లోనూ, ఇతర వాపుల్లోనూ నొప్పి, పోటు తగ్గుతాయి. పచ్చికొబ్బరి కోరులో, పసుపుకలిపి కడితే గోరుచుట్టు పక్వానికి వస్తుంది. వృషణాలలో వాపు తగ్గుతుంది…

దంత వ్యాధులకు కొబ్బరినూనెతో ఆయిల్ పుల్లింగ్:
కొబ్బరినూనె స్వచ్ఛమైనదైతే, అది పైత్యవాతాల్ని హరిస్తుంది. దేహపుష్టిని కల్గిస్తుంది. ఈ నూనెని నోట్లో పోసుకొని కొద్దిసేపు రోజూ పుక్కిలిస్తే దంతరోగాలు, ఊపిరితిత్తుల్లో రోగాలూ తగ్గుతాయని శాస్త్రం.
ఇలా చేయడం వలన మెదడుకు కూడా మేలుచేస్తుంది.

కేశ వర్ధని కొబ్బరినూనె:
స్వచ్చమైన కొబ్బరినూనె వెంట్రుకల కుదుళ్ళను గట్టిపరిచి, వెంట్రుకలు బలంగా, నల్లగా ఎదిగేలా చేస్తుంది. కళ్ళకు మెదడుకు చలవనిస్తుంది. వేడి శరీరం వున్నవారు ఈ నూనెతో మర్దన చేసుకుంటే చలవచేస్తుంది. ఎండు కొబ్బరితో కాకుండా పచ్చికొబ్బరితో నూనె ని తీసి ఔషధంగా తీసుకుంటే, క్షయవ్యాధి వంటి వ్యాధుల్లో రోగి కృశించిపోతున్నప్పుడు బలాన్నిస్తుంది. అరచెంచా మోతాదులో, మూడుపూటలా తీసుకోమని ఆయుర్వేద శాస్త్రం చెపుతుంది.

వీర్య వర్ధకం కొబ్బరి:
ఆఖరుగా అసలు విషయం చెప్పాలి, ఏంటి అంటే..
లేత కొబ్బరి, ఎండుకొబ్బరికంటే మంచిది. ఇది దేహపుష్టిని కల్గించడమే కాకుండా వీర్యవర్ధకంగా పనిచేస్తుంది. స్త్రీ సంభోగం వలన కల్గిన ఆయాసాన్ని అలసటనీ పోగొడ్తుంది. ఆగండి !…. అదే పనిగా కొబ్బరిని వాడితే మాత్రం పైత్యం చేస్తుంది. అజీర్తి, రక్తక్షీణత, దగ్గు, ఆయాసం, కడుపుబ్బరం వున్నవాళ్ళు కొబ్బరిని జాగ్రత్తగా, పరిమితంగా వాడాలి. ఎండుకొబ్బరి, పచ్చి కొబ్బరి కన్నా సౌమ్యంగా పనిచేస్తుంది. పచ్చి కొబ్బరి సరిపడని వారికి ఎండు కొబ్బరి సరిపడవచ్చు. ప్రయత్నించి చూడండి. హృదయ వ్యాధులకు ఇది మంచిది కూడా! ఏ కారణం చేతనైనా కొబ్బరి పడకపోతే బియ్యం కడిగిన నీళ్ళుగానీ, బెల్లంగానీ, నిమ్మకాయ రసంగానీ, తీసుకొంటే దీనికి విరుగుడుగా పనిచేస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button