ఘుమఘుమలాడే దాల్ మఖానీ రెస్టారెంట్ స్టైల్ ఇలా చేసుకోండి..
Dal Makhani Recipe: దాల్ మఖానీ పంజాబీ వంటకాల్లో చాలా ప్రసిద్ధి. చిక్కగా, క్రీమీగా ఉండే ఈ పప్పును మీరు అన్నం లేదా నాన్ లేదా పరాఠాలతో కలిపి తినవచ్చు. ఈ కింద దాల్ మఖానీ రెసిపీని చూడండి.
ముద్దపప్పులో నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలుసు, అలాగే వెన్నముద్దల రుచి కూడా మనకు తెలుసు. మరి వెన్నముద్ద, పప్పు రెండూ కలిపి తింటే దాని రుచి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఈ రెండూ కలిపి వండితే దానిని దాల్ మఖానీ అంటారు. మీరు ఈ వంటకం గురించి వినే ఉంటారు, పంజాబీ వంటకాల్లో ఈ రెసిపీ చాలా ప్రసిద్ధి. తరచుగా పంజాబీ దాబాలలో, రెస్టారెంట్లలో లభించే మెన్యూలో కనిపిస్తుంది. చిక్కగా, క్రీమీగా ఉండే ఈ పప్పును మీరు అన్నం లేదా నాన్ లేదా పరాఠాలతో కలిపి తినవచ్చు. దీని చాలా అద్భుతంగా ఉంటుంది. దాల్ మఖానీని మీరు ఇంట్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇందుకు ఏమేం కావాలి, ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ కింద దాల్ మఖానీ రెసిపీని చూడండి.
Dal Makhani Recipe కోసం కావలసినవి:
2 కప్పుల మినపపప్పు
7 కప్పులు నీరు
2 కప్పుల టొమాటో ప్యూరీ
2 టేబుల్ స్పూన్ వెన్న
2 టీస్పూన్ షాజీరా
1 టీస్పూన్ చక్కెర
1 టీస్పూన్ కసూరీ మెంతి
1 టేబుల్ స్పూన్ నూనె
1 టీస్పూన్ మిరప పొడి
1 టేబుల్ స్పూన్ అల్లం
1/2 కప్పు క్రీమ్
2-3 పచ్చి మిరపకాయలు
రుచికి తగినంత ఉప్పు
దాల్ మఖానీని ఎలా తయారు చేయాలి
1. ముందుగా ఒక కుక్కర్లో పప్పు, నీరు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అల్లం వేసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
2. మరోవైపు ఒక పాన్ లో కొద్దీగ నూనె, వెన్నను వేసి వేడి చేయండి . దానిలో కొంచెం కస్తూరి మెంతిని,షాజీరా వేసి వేయించండి.
3. దానిలో టొమాటో ప్యూరీ, కొద్దీగ ఉప్పు, కారం, పంచదార వేసి కలపండి. నూనె విడిపోయే వరకు, అధిక మంట మీద ఉడికించండి.
4. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించిన పప్పుని వేసి ఉడికించాలి. మృదువుగా కలుపుతూ పప్పు స్థిరత్వం కోసం అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలపండి. అన్నీ బాగా కలిసే వరకు మూత లేకుండా ఉడకించండి.
5. చివరగా క్రీమ్ వేసి, అది వేడెక్కిన తర్వాత, పచ్చి మిరపకాయల ముక్కలను పైనుంచి గార్నిషింగ్ చేయండి.
అంతే, ఘుమఘుమలాడే దాల్ మఖానీ రెడీ.