Indian Butter Tree Benefits – ఇప్పచెట్టుతో ఆరోగ్య రహస్యాలు
Indian Butter Tree: Nutrients, Benefits & Uses
ఇప్పచెట్లు అరణ్యాలలో ఎక్కువగా పెరుగుతూవున్నా, మన గ్రామాలలో కూడా చాలాచోట్ల కనిపిస్తుంటాయి. గ్రామీణులకు ఇప్పచెట్లు బాగా తెలుసు. ఇప్పతైలంతో దేవునికి దీపం వెలిగిస్తారు. ఎన్నో విధాలుగా మానవలోకాన్ని అనేక తరాలుగా కాపాడుతున్న ఈ ఇప్పచెట్టు మరిన్ని ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పచెట్టు పేర్లు : సంస్కృతంలో మధుక, మధుఫుష్ప అని, హిందీలో మధువా అని, తెలుగులో ఇప్పచెట్టు అని, ఆంగ్లంలో Indian Butter Tree, Mahwash Tree అంటారు.
ఇప్పచెట్టు- రూప గుణ ధర్మాలు: ఇది తీపిరుచితో చలువచేస్తుంది. దీని మాను బెరడు వాతనొప్పులను, పైత్యాన్ని హరిస్తుంది. దీని కాయలపొడి నలుగుపెడితే చర్మరోగాలు తగ్గిస్తుంది.
ఇప్పపూలతో – ఇప్పసారా : ఇప్పపూలనుండి కాచితీసిన ఇప్పసార మన రాష్ట్రంలో ఎన్నో తరాలనుండి ప్రసిద్ధిగాంచింది. ఇది నిషా ఇవ్వడమేకాక శరీరానికి మంచిబలం కలిగిస్తూ. “వాత, పైత్య రోగాలను హరించివేస్తుంది. రుచికి తీయగా వుంటుంది. వీధులలో దొరికే బ్రాందీ, విస్కీల కన్నా కోటిరెట్లు మెరుగైంది.
ఎక్కిళ్ళకు – ఇప్పపూలు: ఇప్పపూలను దంచితీసిన రసం, తేనె కలిపి నాలుగు చుక్కలు ముక్కులలోవేసి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
మానసిక వికారాలకు – ఇప్పచేవ: ఇప్పచెట్టు బెరడులోపల వుండే చేవ తెచ్చి, దంచి జల్లెడ పట్టి, ఆమెత్తటి చూర్ణాన్ని మానసిక రోగాలతో బాధపడేవారు, దెయ్యం పట్టిందని ఊగి పోయేవారు రెండు ముక్కుల గుండా నశ్యం పీల్చినట్లు రెండు మూడుచిటికెలు రెండుపూటలా పీలుస్తుంటే ఆ మానసికరోగం హరించిపోతుంది.
రక్తపైత్యరోగానికి – ఇప్పపట్ట: శరీరంలో ఏభాగంనుండి రక్తంపోతూవున్నా, ఇప్పచెట్టుబెరడు 10 గ్రాములు కడిగి, నలగ్గొట్టి ఒకగ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి, చల్లగా ఐన తరువాత, రెండు లేక మూడుపూటలా తాగుతుంటే రక్తం పడటం ఆగుతుంది.
తలలోపుట్టే – కురుపులకు : ఇప్పచెక్కపొడి, మిరియాలపొడి సమంగా కలిపి మంచినీటితో మెత్తగానూరి, ఆ మిశ్రమాన్ని తలపైన లేపనంచేస్తుంటే కంపువాసనకొట్టే కురుపులు మాడిపోతాయి.
గొంతువాపుకు – ఇప్పపువ్వు : గొంతువాపుతో ఆహారాన్ని మింగలేనివారు ఇప్పపువ్వు 3 గ్రాములు, నోటిలోవేసుకొని కొద్దికొద్దిగా నమిలి మింగి కొంచెం నీరు తాగుతూవుంటే గొంతు వాపు తగ్గి తినగలుగుతారు.
అతిదాహానికి – ఇప్పపువ్వు : ఇప్పపువ్వు బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతూవుంటే అతిదాహం అణగిపోతుంది.
పెదవులరోగాలకు ఇప్పచెక్క: ఇప్పచెక్కను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఆరబెట్టి, దంచి జల్లించి పలుచని నూలుబట్టలో జల్లెడ పట్టి, అతిమెత్తటిపొడి తయారుచేసుకోవాలి. కొంచెంపొడిలో కొంచెం నెయ్యి కలిపి రంగరించి పెదవులపైన లేపనంచేస్తుంటే పెదవుల పగుళ్ళు, పుండ్లు, నల్లదనం హరించి పెదవులు మృదువుగా, మనోహరంగా తయారౌతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.