Malabar nut Benefits: – ఈ చెట్టు గురించి తెలుసుకున్న ఒక్క వ్యక్తి గ్రామంలోవుంటే ఇక ఆగ్రామంలో అనేకరోగాలను తరిమి కొట్టవచ్చు
Malabarnut: Nutrients, Benefits & Uses
మన గ్రామాలలో ప్రముఖంగా కనిపించే అడ్డసరం వర్ణించడానికి వీలులేని ఘనమైన ఔషధి. దీనిని ఆయుర్వేద భాషలో వైద్య అని అంటారు. అనాదిగా దీనిని దీర్ఘకాలికమైన శ్వాసరోగాలకు ఉపయోగించడం వైద్య సంప్రదాయంగా వుండేది. అయితే, ఈచెట్టును అనేకవిధాలుగా పరిశీలించిన ప్రాచీన శాస్త్రవేత్తలు అనేక ఇతర రోగాలకు కూడా ఇది తిరుగులేకుండా పనిచేస్తుందని నిరూపించారు. దీని ఆకులు, పూలు, కాడలు, వేర్లు, ఇలా సర్వాంగాలు మనకు ఉపయోగపడేవే. ఈ చెట్టు గురించి తెలుసుకున్న ఒక్క వ్యక్తి గ్రామంలోవుంటే ఇక ఆగ్రామంలో అనేకరోగాలను తరిమి కొట్టవచ్చు. అయితే, ఈ ఆధునికకాలంలో గ్రామీణులకు కూడా ఈ అడ్డసరం గురించి తెలియకపోవడం చాలా విచారకరం. అడ్డసరం ప్రాముఖ్యత, దీనితో ఎటువంటి రోగాలను నయం చేయవచ్చు,ఎలా వాడాలి అనే తదితర విషయాలను గురించి తెలుసుకుందాం….
అడ్డసరంని సంస్కృతంలో వాసక, వైద్యమాత, ఆటరూష అని, హిందీలో అదూస, విసోంట అని, తెలుగులో అడ్డసరం అని, ఆంగ్లంలో Malabamut అంటారు.
అడ్డసరం – రూప గుణ ప్రభావాలు:
దీనివేర్లు, ఆకులు చేదుగా ఉంటాయి . ఇవి శరీరం లోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వవ్యాధులను నయం చేయగలవు. ముఖ్యంగా పైత్యం, శీతపైత్యం, రక్తపైత్యం, శ్లేష్మం, దగ్గు, మేహం, క్షయరోగం, కుష్టు రోగం, మొదలైన వ్యాధులకు ఈచెట్టు చరమ గీతం పాడుతుంది.
పాండురోగం అనబడే రక్తహీనతకు అడ్డసరం ఆకులు 10గ్రాములు , ధనియాలు 10గ్రాములు, కరక్కాయలబెరడు 10గ్రాములు కలిపి నలగ్గొట్టి అర లీటరు మంచినీటిలో వేసి, రాత్రి నుండి ఉదయం దాకా నానబెట్టి ఉదయం వడపోసుకొని, ఆ నీటిలో ఒకచెంచా కండచక్కెరపొడి కలిపి పరగడుపున తాగుతుంటే రక్తహీనత తగ్గిపోతుంది.
భగందరానికి అడ్డసరం ఆకు:
అడ్డసరం ఆకును మెత్తగానూరి బిళ్ళలాగాచేసి దాని పైన కొంచెం సైంధవలవణం పొడి చల్లి, దాన్ని ఆసనం పక్కన పుట్టిన భగందరం అనబడే లూటీ పైన వేసి కట్టు కడుతూవుంటే భగందరం మాడిపోతుంది.
అన్నిరకాల కామెర్ల రోగాలకు:
అడ్డసరం ఆకులను కడిగి, దంచి తీసిన రసం 15గ్రాములు మంచిపట్టుతేనె 20గ్రాములు కలిపి, ఒక మోతాదుగా మూడుపూటలా ఇస్తూవుంటే, ఏవిధమైన కామెర్లవ్యాధి అయినా ఏడునుండి పదిరోజులలో తగ్గిపోతుంది.
ఉబ్బసానికి – అడ్డసరం చుట్ట:
అడ్డసరం ఆకులు, వేర్లపై వుండే బెరడు ఈరెండింటిని కలిపి పొడికొట్టి నిలువవుంచుకోవాలి. ఈపొడిని పొగతాగే చిలుముగొట్టంలో పోసి అంటించి అపొగ పీలుస్తూవుంటే క్రమంగా ఉబ్బసం తగ్గిపోతుంది.
అడ్డసరంతో అందాల వెంట్రుకలు:
అడ్డసరం ఆకులు దంచి తీసిన రసం రెండు కేజీలు, త్రిఫలాలు దంచి తీసిన రసం అరకేజీ, నువ్వుల నూనె రెండుకేజీలు కలిపి చిన్నమంటపైన పదార్థాలన్నీ ఇగిరిపోయి నూనె మిగిలేవరకు మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజుసీసాలో నిలువ చేసుకోవాలి.
ఈతైలాన్ని రోజూ తలకు రాసుకుంటూవుంటే మెదడుకు బలం కలగడమేకాక తలలోని చుండ్రు, పుండ్లు, గుల్లలు, దురదలు తగ్గిపోయి క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ నల్లబడతాయి.
క్షయదగ్గు – తగ్గుటకు:
అడ్డసరం ఆకుల రసం 20గ్రాములు , తేనె 5 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రెండుపూటలా రోజూ సేవిస్తూ వుంటే, క్రమంగా క్షయదగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.
అన్నిరకాల శ్లేష్మరోగాలకు
అడ్డసరం ఆకుల రసం 20గ్రాములు , అల్లంరసం 20గ్రాములు కలిపి రెండుపూటలా, మూడురోజులపాటు తాగుతూ వుంటే గొంతులో అడ్డుపడే కఫమంతా కరిగిపోయి శ్లేష్మ సమస్య నివారించబడుతుంది.
దురదలను దుమ్ముదులిపే యోగం
అడ్డసరం ఆకు, పసుపు సమంగా తీసుకొని తగినంత గోమూత్రంతో మెత్తగానూరి దురదలపైన పట్టించి, అది బాగా ఆరిపోయిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానంచేస్తుంటే దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి.
అన్నిరకాల దగ్గులకు అడ్డసరం అడ్డసరం ఆకుల రసం 5గ్రాములు, తులశాకురసం 5గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తుంటే ఏ రకమైన దగ్గుఅయినా తగ్గిపోతుంది.
రక్తపిత్తరోగానికి – అడ్డసరం
దగ్గితే నోటివెంట రక్తంపడే సమస్యను రక్తపిత్తం అంటారు. ఈసమస్యకు అడ్డసరం ఆకురసం 20 గ్రాములు , కందచక్కెరపొడి 10గ్రాములు , తేనె 5 గ్రాములు కలిపి పూటకు ఒకమోతాదుగా రెండుపూటలా సేవిస్తుంటే రక్తం పడటం వెంటనే ఆగిపోతుంది.
మొండి ఉబ్బసానికి – జగమొండియోగం
అడ్డసర ఆకురసం 10గ్రాములు, వాకుడుపండ్లరసం 10 గ్రాములు , ఉత్తరేణి ఆకురసం 10 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి రోజూ పరగడుపున సేవించాలి. ఇదే రసాన్ని తేనె కలపకుండా సాయంత్రంపూట సేవించాలి. ఇలా చేస్తుంటే అతిమొండి ఉబ్బసరోగం అయినా 40 రోజులలో తగ్గిపోతుంది.
శరీరంలో ఎటునుండి రక్త పోతూవున్నా, అడ్డసరపాకులు దంచి తీసిన రసం ఒకపాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి చిన్నమంటపైన మరిగిస్తూ రసం విరిగినతరువాత దించి వడపోసి దానిని 50 గ్రాముల మోతాదుగా లోపలికి సేవింపచేస్తుంటే ఎటువంటి రక్తప్రవాహమైనా కట్టుకుంటుంది.
అనేకరోగాలకు – అడ్డసరలేహ్యం తయారీవిధానం :
ఒక కేజీ అడ్డసరం ఆకులను కొంచెం నలగ్గొట్టి ఎనిమిది లీటర్ల మంచినీటిలోవేసి, రెండుకేజీల కషాయం మిగిలేవరకు మరిగించి దించి వడపోసుకోవాలి. ఈ కషాయంలో పటిక బెల్లంపొడి ఒక కేజీ మరియు కరక్కాయ బెరడు పొడి 640గ్రాములు కలిపి చిన్నమంటపైన వండాలి. ఆపదార్థం గడ్డ కడుతూ పాకానికి వచ్చినతరువాత అందులో తవాక్టీరి చూర్ణం 40గ్రాములు, దాల్చినచెక్క పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 20గ్రాములు, ఆకుపత్రి పొడి 10 గ్రాములు, ఏలకుల పొడి 10 గ్రాములు, నాగకేసరాల పొడి 10 గ్రాములు వేసి బాగా కలదిప్పాలి. పాత్రనుదించి చల్లారిన తరువాత అందులో తేనె 80 గ్రాములు కలపాలి. ఇదే అద్భుతమైన అడ్డసర లేహ్యం.
వాడేవిధానం: పూటకు 5 గ్రాముల మోతాదుగా రెండుపూటలా తిని ఒకకప్పు ఆవుపాలు తాగాలి.
పిల్లల కొరింతదగ్గులు, మలబద్దకం, అతిదాహం, కడుపు పొంగు, క్షయరోగం, ఉబ్బసరోగం, దగ్గు, పడిశ భారం, గుండె బలహీనత మొదలైనవన్నీ హరించి పోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.